Sunday, September 22, 2024
HomeTrending Newsచిట్టితల్లులకు ‘స్వేఛ్చ’ : సిఎం జగన్

చిట్టితల్లులకు ‘స్వేఛ్చ’ : సిఎం జగన్

బాలికా విద్యను ప్రోత్సహించడానికే ప్రభుత్వం స్వేఛ్చ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఋతుస్రావం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులతోనే 23 శాతం మంది చిట్టి తల్లులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కమిటీ పేర్కొందని సిఎం గుర్తు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు కింద మరుగుదొడ్లు బాగుచేయడం, వాటికి నిరంతర నీటి సరఫరా, నిర్వహణపై కూడా దృష్టి పెట్టామని, శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించేందుకే స్వేచ్ఛ కార్యక్రమానికి రూపకల్పన చేశామని వివరించారు.

సృష్టిలో భాగమైన ఈ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడడం ఒక తప్పు అన్నట్లు భావిస్తూ వస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని సిఎం అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మందికి పైగా ఉన్న చిట్టితల్లులకు బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందిస్తున్నామని సిఎం వివరించారు.

బాలికలు ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాద్యాయులు, అధ్యాపకులు అవగాహన కలిగించాలని కోరారు. దీనిలో భాగంగా నెలకోరోజు ఏడు నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్ధినులకు ప్రత్యేక శిబిరం నిర్వహించాలన్నారు. దీనిలో ఏఎన్ఎంతో పాటు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు కూడా హాజరు కావాలని, దిశ యాప్ పై కూడా విద్యార్థినుల్లో అవగాహన కలిగించాలన్నారు. వైద్య-ఆరోగ్య, స్త్రీ-శిశు సంక్షేమ, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆసరా బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్లు దీనిపై కూడా పర్యవేక్షించాలని సూచించారు. స్కూళ్ళు, కాలేజీల్లో మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకుల్లో ఒకరిని స్వేఛ్చ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తామని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్