రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో గృహ నిర్మాణాలకు నేడు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 ఇళ్ళ నిర్మాణానికి 28,084 కోట్ల రూపాయలు కేటాయించింది. క్యాంప్ కార్యాలయం నుంచి నేడు జూన్ 3న సీఎం వైయస్ జగన్ వర్య్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
2023 జూన్ నాటికి ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు’
ఎన్నికల సందర్భంగా వైయస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు’ అనే హామీని 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కాగృహాలను నిర్మించేందుకు ప్రణాలికలు సిద్ధం చేశారు.
తొలి విడతలో 15.60 ఇళ్ళు, రెండో విడతలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ళను నిర్మించనుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
మొదటిదశ ఇళ్ళ నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ళను వైయస్‌ఆర్ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు. అలాగే 2,92,984 ఇళ్ళను స్వంత స్థలాలు కలిగిన లబ్దిదారులకు, 1,40,465 ఇళ్ళను నివేశన స్థలాలు కలిగిన లబ్ధిదారులకు కూడా పక్కాగృహాలు మంజూరు చేయడం ద్వారా వాటి నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు.