Saturday, January 18, 2025
HomeTrending Newsరాష్ట్రానికి రేషన్ పెంచండి : సిఎం జగన్ వినతి

రాష్ట్రానికి రేషన్ పెంచండి : సిఎం జగన్ వినతి

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పద్ధతిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, ఆ కార్డులకు కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ మంజూరు చేయించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర రైల్వే, వాణిజ్య–పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియ ప్రజాపంపిణీ శాఖలమంత్రి పియూష్‌గోయల్‌ కు విజ్ఞప్తి చేశారు.

2015 డిసెంబర్‌ వరకూ జాతీయ ఆహార భద్రతా చట్టంకింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తూ వచ్చారని, కానీ ఆ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96శాతం కుటుంబాలకు, పట్టణాలు–నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు కేవలం 0.91 కోట్ల రేషన్‌ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని, కేటాయింపులను 1,85,640 మెట్రిక్‌ టన్నుల నుంచి 1,54,148 కి తగ్గించారని కేంద్రమంత్రికి వివరించారు.

ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని, తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని సిఎం జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.

పారదర్శక పద్ధతిలో రాష్ట్రంలో ఇంటింటా సర్వే జరిపి రేషన్‌కార్డులు కొత్తగా అందజేశామని, ప్రస్తుతం 1.47 కోట్ల రేషన్ కార్డుదారులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమానికి అర్హులని సిఎం తెలియజేశారు. హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్‌భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తోందని… ఇది రాష్ట్రానికి చాలా భారమని, వెంటనే దీన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి కోరారు.

ఉచిత రేషన్‌ బియ్యం కింద పౌర సరఫరాల శాఖ కార్పోరేషన్ కు రూ,3,229 కోట్ల రూపాయలు బకాయి పడిందని, వీటిని వెంటనే చెల్లించాలని సీఎం పియూష్ గోయెల్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరమని విన్నవించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్