వాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. వాక్సిన్ తయారీ, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది తలి విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతులకు నగదు జమ చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమం చేపట్టామని, 52.38 లక్షల మంది రైతులకు మొదటి విడతగా ఒక్కొక్కరికి 7,500 రూపాయల చొప్పున మొత్తం 3,928 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.
ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్ పై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. దేశంలో మొత్తం ¬172 కోట్ల వాక్సిన్ డోసులు అవసరమవుతాయని, ఇప్పటివరకూ కేంద్రం అందించింది 18 కోట్ల డోసులు మాత్రమేనని చెప్పారు. ఇప్పటి వరకూ కేవలం 11 శాతం మందికి కూడా వాక్సిన్ ఇవ్వలేకపోయామన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో 18 ఏళ్ళు పైబడిన వారికి 7 కోట్ల డోసులు అవసరమని, ఇప్పటివరకూ ఇచ్చింది 73 లక్షలు మాత్రమేనని వివరించారు.
రాష్ట్రం, దేశంలో పరిస్థితి ఇలా ఉంటే కేవలం రెండు కంపెనీలు మాత్రమే వాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ సామర్ధ్యం పెంచాల్సిన అవసరం తప్పకుండా వుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.