Sunday, January 19, 2025
HomeTrending Newsబద్వేలు అభివృద్ధికి రూ.500 కోట్లు: సిఎం

బద్వేలు అభివృద్ధికి రూ.500 కోట్లు: సిఎం

బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ఆదరణ చూపారు. తమ బిడ్డలా ఆప్యాయత చూపారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని’ జగన్ వెల్లడించారు. రెండురోజుల పాటు అనంతపురం, వైయస్సార్‌ జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ బద్వేలులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు రూ.500 కోట్లకు పైగా నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, ఇవి పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.

ఈ నియోజకవర్గ అభివృద్ధిని గతంలో పాలకులు విస్మరించారని, తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ హయాంలో మాత్రమే బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో 14 టీఎంసీల నీళ్లు నిల్చాయి.. ఆ తర్వాత ఏనాడూ నాలుగైదు టీఎంసీలకు మించి నీరు నిల్వ లేదని… దీనికి కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, మంచి చేయాలన్న తపన, ఆలోచన లేకపోవదమేనని వ్యాఖ్యానించారు.

బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలలో నిండు కుండలా కనిపిస్తోందని, ఎప్పుడూ ఈ ప్రాజెక్టు అలాగే ఉండాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించే విధంగా అడుగులు వేశామని తెలియజేశారు. ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం పనులు రూ.45 కోట్లతో మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. దీని వల్ల ప్రాజెక్టులో మొత్తం 17 టీఎంసీలు ఎప్పుడూ నింపుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్