Sunday, January 19, 2025
HomeTrending Newsవంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై జగన్ హర్షం

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై జగన్ హర్షం

వంశధారపై ట్రైబ్యునల్‌ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి స్వాగతించారు.  సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలన్నారు. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా ఒడిషాకూ ప్రయోజనకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో సంత్సంబంధాలు కోరుకుంటున్నామని, నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచి జరుగుతుందన్నారు.

నేరడి బ్యారేజ్‌ నిర్మాణం కోసం జరిగే శంఖుస్థాపన కార్యక్రమానికి ఒడిశా సీఎంతోపాటు, ఆ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. వివాదాలతో కాకుండా….పరస్పర సహకారంతో ముందుకుసాగాలన్నదే తమ విధానమన్నారు. ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో సిఎంఓ అధికారులతో జరిగిన సమావేశంలో వంశధార ట్రైబ్యునల్‌తీర్పుపై  సమీక్షించారు.

వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతిచ్చింది. ఈ మేరకు నిన్న తన తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి  కూడా గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది.  జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నీటిని తరలించుకోవాలని  ఏపీకి సూచించిన ట్రైబ్యునల్‌… నేరడి బ్యారేజీకోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలని తీర్పు చెప్పింది.  దీనికోసం అయ్యే ఖర్చును ఏపీ భరించాలని పేర్కొంది.  తీర్పును అమలు చేసేందుకు అంతర్‌రాష్ట్ర నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ సూచిందింది. దీనిపై ఏపి సిఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్