Saturday, November 23, 2024
HomeTrending Newsకేఆర్ఎంబి తీరు సరికాదు : జగన్ లేఖ

కేఆర్ఎంబి తీరు సరికాదు : జగన్ లేఖ

కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) మొదట తెలంగాణలోని ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లకు జగన్ లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి తీరుపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్న కేఆర్ఎంబి, తాము చేస్తున్న ఫిర్యాదులను పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. కేఆర్ఎంబిపరిధిని తక్షణం నోటిఫై చేయాలని కోరారు.

విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని, తెలంగాణా వైఖరితో కృష్ణా జలాల విషయంలో తమ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోందని,  కృష్ణాజలాలు సముద్రంలో కలుస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్ప మరో మార్గం లేదని జగన్ లేఖలో పేర్కొన్నారు.

జగన్ లేఖలోని ముఖ్యంశాలు:

  • ఏపి పునర్విభజన చట్టాన్ని తెలంగాణ పదే పదే ఉల్లంఘిస్తోంది
  • ఆంధ్ర ప్రదేశ్ న్యాయమైన హక్కులను తెలంగాణ ప్రభుత్వం హరిస్తోంది
  • శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల కన్నా తక్కువ నీరున్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది
  • ఈనెల 1 నుంచి ఇప్పడి వరకు 19 టిఎంసిల నీరు విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంది
  • తెలంగాణ తీరుతో శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరే పరిస్థితి లేదు
  • 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయగలం
  • 796  అడుగుల నీటి మట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోంది
  • శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకపోతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేం
  • పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తోంది
  • తెలంగాణా అక్రమ ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం నుంచి ఎపీకి చుక్క నీరు కూడా అందదు
  • వెంటనే ఈ విషయమై జోక్యం చేసుకోవాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్