ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. కోవిడ్‌నివారణలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని జగన్ తెలిపారు.
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపి సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు.
- కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు
- రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం
- అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు
- రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవు, అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనపరిచాం
- రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి
- ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశాం
- లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేశాం
- దీనివల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం
- వ్యాక్సినేషన్ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారం
- దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను.
- 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం
- వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగాం.
- జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు
- జులైనెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు
- కాని క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు
- జూన్‌నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే
ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనిజిమెంట్ అండ్ వాక్సినేషన్) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.