AP new Districts: ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణలో ఓ గొప్ప ముందడుగు పడింది. నేటి నుంచి 26 జిల్లాలతో రాష్ట్ర పరిపాలన సాగనుంది. నిన్నటి వరకూ ఉన్న 13 జిల్లాలు నేటి నుంచి 26 జిల్లాలు అవుతున్నాయి. నేడు (04.04.2022, సోమవారం) ఉదయం 9.05 నుంచి 9.45 నిముషాల మధ్య క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు, బలహీనవర్గాలకు చేరువగా ఉండాలని ప్రభుత్వ సంకల్పం. అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్ధానాన్ని నెరవేరుస్తూ, రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్ధీకరణ కసరత్తు పూర్తి చేసింది.
నిన్న…గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణలో తొలి అడుగు వేసిన జగన్ ప్రభుత్వం నేడు…కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు వేసింది. ఇదే ఇదే స్పూర్తితో రాబోయే కాలంలో 3 ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేయాలని కృత నిశ్చయంతో ఉంది.
ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. గిరిజన సోదరుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలు చేశారు. ప్రతి జిల్లాలో సగటున 6 లేదా 7 లేదా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు. 18 నుండి 23 లక్షల మంది జనాభా ఉండేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది.
ప్రజా సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 లేదా మూడు, లేదా నాలుగు రెవెన్యూ డివిజన్‌లు ఉండేలా కొత్తగా 23 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు అందుబాటులో రానున్నాయి. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది.
Also Read : కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం