Saturday, January 18, 2025
HomeTrending Newsసమయానికి సర్వే పూర్తి కావాలి:  జగన్

సమయానికి సర్వే పూర్తి కావాలి:  జగన్

భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  కోవిడ్‌తో  కాస్త మంద గమనంలో ఉన్నసర్వే ను పరుగులు పెట్టించాలని, లక్ష్యాలను అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’పై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.

మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని,  అక్కడ సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా ఏయే పరికరాలు కావాలో వాటిని వెంటనే తెప్పించుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2023 నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఇప్పటికే 70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని అధికారులు సిఎంకు వివరించారు.  సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని చెప్పారు.

సర్వేలో పైలట్‌ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్‌ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. కాగా, పట్టణాలు, నగరాల్లో కూడా సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్