Vizag Steel Plant Privatization :
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ వల్ల దాదాపు 20వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారని సిఎం గుర్తు చేశారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సిఎం జగన్ భేటి అయ్యారు. దాదాపు గంటకుపైగా ఇరువురి మధ్య సమావేశం జరిగింది.
ప్రజల త్యాగాల పునాదుల మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడిందని, 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 2002–15 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19,700 ఎకరాల భూమి ఉందని, దీనివిలువ దాదాపు రూ. లక్ష కోట్లపైనే ఉంటుందన్నారు.
స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందని, ప్లాంట్ విస్తరణ కోసం వివిధ బ్యాంకులనుంచి రుణాలు తీసుకుందని, ఇదే సమయంలో అంతర్జాతీయం ఉక్కు పరిశ్రమలో తలెత్తిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచి స్టీల్ ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపిన సీఎం. సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చుకూడా విపరీతంగా పెరిగిపోయిందన్నారు సిఎం.
తెలుగు ప్రజలకు గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి ఈ కంపెనీని కాపాడుకునే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. కరోనా రెండో వేవ్ సందర్భంలో 7వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్ అందించిందని, లక్షలమంది ప్రాణాలు కాపాడిందని వివరించారు.
కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని సిఎం జగన్ విన్నవించారు. హెచ్‌పీసీఎల్, గెయిల్ సంస్థలు కలిసి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ. 32,900 కోట్లు ఖర్చుకాగల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశాయని, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రం కోరిందని సిఎం వివరించారు.
Latest News On Vizag Steel Plant Privatization :
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమని, ప్రాజెక్టు విధివిధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్ గ్రూపు కోసం సభ్యులను నామినేట్ చేశామని, కేంద్ర కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీచేయాలని కేంద్ర మంత్రిని కోరారు జగన్.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను 25శాతం తగ్గించిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు కూడా తగ్గాయని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో నిమిత్తంలేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని ర్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు ధర్మేంద్ర ప్రదాన్.
Also Read : మూడు రాజధానులకు సహకరించండి : జగన్