వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి కావడం ఖాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు, ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు మీడియాతో మాట్లాడారు. భగవంతుని ఆశీస్సులతో మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి ఐ టిడిపి సభలో పూజలు, యజ్ఞాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొట్టు తీవ్రంగా ప్రతిస్పందించారు. దేవాదాయ శాఖ నిర్వహించిన యజ్ఞంపై బాబు దుష్ప్రచారం చేస్తున్నారని, ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే నిర్వహించామని స్పష్టం చేశారు. మంత్రులు, సిఎం జగన్ పై బాబు నిన్న బాధ్యతారహితంగా మాట్లాడారని, కారుకూతలు కూశారని మండిపడ్డారు. ఆయనలాంటి నేత ఏపీ రాజకీయాల్లో ఉండడం మన ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అవినీతిలో అనకొండ లాంటి ఆయన తమపై అవాకులు, చవాకులు పేలుతూ, వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. రెండు ఎకరాల రైతు అయిన చంద్రబాబు నేడు లక్షల కోట్ల రూపాయలకు ఏ వ్యాపారం చేసి ఎదిగారని, ఏదైనా వజ్రాల గని దొరికిందా అని సూటిగా ప్రశ్నించారు.
మోసం, దగా, వెన్నుపోటు కలిపితే చంద్రబాబు అని, దేవుడితో పరాచికాలాడితే ఇంకా పాతాళానికి పోతారంటూ హెచ్చరించారు. ఈ దేశంలో నైతిక విలువలు ఏమాత్రం లేని ఏకైక నాయకుడు బాబు మాత్రమేనని, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని మండిపడ్డారు. 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన బాబు రాష్ట్రాన్ని అధః పాతాళానికి నెట్టారన్నారు.