రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామిని అసెంబ్లీకే పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ అధినేత, సిఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. గత జాబితాలో ఆయనను చిత్తూరు పార్లమెంట్ కు… అక్కడి సిట్టింగ్ ఎంపి రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. కానీ నేడు ప్రకటించిన ఆరో జాబితాలో వీరిద్దరినీ తమ తమ సిట్టింగ్ స్థానాలకే తిరిగి పంపారు. ఇక ప్రకాశం జిల్లాలో… గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె. నాగార్జున రెడ్డిలను కుండమార్పిడి చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆరో జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున ప్రకటించారు.
గుంటూరు ఎంపి అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు రమణను ఖరారు చేయగా…. రాజమండ్రి ఎంపి స్థానానికి ప్రముఖ వైద్యుడు, మాజీ కార్పొరేటర్ డా. గూడూరి శ్రీనివాస్ ను నియమించారు. నర్సాపురం ఎంపి అభ్యర్ధిగా న్యాయవాది గూడూరి ఉమాబాలను ఎంపిక చేశారు.
కాగా మాజీ ఎంపి బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించనున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట లోక్ సభకు పంపడంతో… ఆ స్థానం నుంచి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ ను నియమించారు. ఎన్టీఆర్ జిల్లాలో కీలక నియోజకవర్గం మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను తప్పించి ఆయన స్థానంలో స్థానిక జడ్పీటీసీ సభ్యుడు నర్నాల తిరుపతిరావు యాదవ్ కు అవకాశం కల్పించారు.
ఆరో జాబితా:
- రాజమండ్రి (ఎంపి) – డా. గూడూరి శ్రీనివాస్
- నర్సాపురం (ఎంపి) – శ్రీమతి గూడూరి ఉమాబాల
- గుంటూరు (ఎంపి) – ఉమ్మారెడ్డి రమణ
- చిత్తూరు ఎస్సీ (ఎంపి) – ఎన్. రెడ్డప్ప
- మైలవరం (ఎమ్మెల్యే) – తిరుపతిరావు యాదవ్
- మార్కాపురం (ఎమ్మెల్యే) – అన్నా రాంబాబు
- గిద్దలూరు (ఎమ్మెల్యే) – నాగార్జున రెడ్డి
- నెల్లూరు సిటీ (ఎమ్మెల్యే) – ఎండి ఖలీల్
- గంగాధర నెల్లూరు (ఎస్సీ) (ఎమ్మెల్యే) – కె. నారాయణ స్వామి