ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామిని కొండగట్టులో దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఆలయ ఈవో శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి.. పవన్ కళ్యాణ్ కి సంప్రదాయబద్దంగా తలపాగ చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయస్వామికి ఇరు వైపులా ఉన్న వెంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి ప్రసాదం అందచేశారు.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతించారు.
పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తల్వార్ బహూకరించి జేజేలు పలికారు. కొండగట్టు ప్రాంతం అంతా పార్టీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.