Saturday, March 14, 2026
HomeTrending Newsఎమ్మెల్యేలతో అసైన్డ్ కమిటీలు : ధర్మాన

ఎమ్మెల్యేలతో అసైన్డ్ కమిటీలు : ధర్మాన

రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ రీ సర్వేతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనం, కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అసైన్డ్ భూములు, అసైన్ మెంట్ కమిటీల ఏర్పాటుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్ మెంట్ కమిటీలు ఉండేవన్నారు. తరువాత కాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా స్థాయి అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లోని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీకి అర్హులుగా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అత్యధికంగా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ చేయలేదన్నారు.

సమగ్ర భూ రీ సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.9,900 కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అర్హులను గుర్తించి రెండున్నర ఎకరాల మెట్ట గాని, 5 ఎకరాల మాగాణి గాని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ పంపిణీ సమగ్ర భూ రీ సర్వేతో సీఎం జగన్ హయాంలో భూ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయనే సంతృప్తి ప్రజల్లో కలుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular