Sunday, January 19, 2025
HomeTrending News10వ తరగతి పరీక్షలపై జులైలో నిర్ణయం: మంత్రి

10వ తరగతి పరీక్షలపై జులైలో నిర్ణయం: మంత్రి

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకొని, షెడ్యూల్ ప్రకటిస్తామని వివరించారు.

ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని,  విద్యార్థుల తమ భవిష్యత్ నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించేందుకు తాము అలోచిస్తున్నామని  మంత్రి సురేష్ పేర్కొన్నారు.  కేంద్రప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని, తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.  స్వీయ నియంత్రణతో కరోనా నుండి తమను తాము కాపాడుకోవచ్చని, కొంతమంది ఉపాధ్యాయులు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

పరీక్షల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని, వాస్తవాలను గమనించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని మంత్రి హితవు పలికారు. పరీక్షల రద్దుతో లోకేష్ ఏం సాధించాలనుకుంటున్నారని, పరీక్షలు రాయకపోతే కరోనా రాదు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్