Employees to protest:
ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. డా. సమీర్ శర్మను కలిసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఐదు పేజీలతో కూడిన డిమాండ్ల నివేదికను ఆయనకు సమర్పించారు. నాలుగైదు నెలలుగా తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నామని అయినా ఇంతవరకూ తమ సమస్యలపై ఏ ఒక్క దానికీ ప్రభుత్వం నుంచీ సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పీఆరీ నివేదిక కూడా ఇంతవరకూ ఇవ్వలేదని, కనీస డిమాండ్లు కూడా నెరవేర్చలేదని అమరావతి జేఎసి ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, 55 శాతం ఫిట్ మెంట్ తో మెరుగైన పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి ముఖ్యమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిఎస్ ను కోరామని, ఈ నెల ఏడవ తేదీలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏడవ తేదీలోపు సమస్యలు పరిష్కారం కాకపొతే రెండ్రోజుల క్రితం తాము ప్రకటించిన కార్యాచరణ యదావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసిన ఉద్యోగులుగా మూడేళ్ళుగా సహకరిస్తూనే ఉన్నామని, 27 శాతం ఐఆర్ ఇచ్చారు కాబట్టి పీఆర్సీ నివేదిక ఐదారు నెలలు ఆలస్యం అయినా ఫర్వాలేదని తాము అనుకున్న మాట వాస్తవమేనని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు స్పష్టం చేశారు.
మరోవైపు జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. స్తైఫండ్ ను స్కాలర్ షిప్ గా పరిగణించి ప్రస్తుతం అమలు 10 శాతం ట్యాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేపు సంబంధిత కాలేజీల వద్ద క్యాండిల్ లైట్ మార్చ్ లు, ఎల్లుండి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖలు సమర్పిస్తామని జూడాల సంఘం నేతలు ప్రకటించారు. ఈ నెల 4 న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని, 5నుంచి ఒపీడీ సేవలు, 7 నుంచి ఐచ్ఛిక సేవలు నిలిపి వేస్తామని, ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రాకుంటే 9వ తేదీ నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని వారు వెల్లడించారు.