ఎన్నికల ఫలితాలకు ముందు సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు-జీఎడి) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ అన్ని మంత్రుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆదేశించింది.
తమ అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఎలాంటి వస్తువులనూ తరలించొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లడానికి వీళ్లేదని సూచించింది. ముఖ్యంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలపై నిఘా పెట్టాలని, అనుమతి లేకుండా తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సచివాలయంలో రాకపోకలపై మరింత దృష్టి సారించాలని, విధిగా వాహనాలు తనిఖీ చేయాలని ఎస్‌పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని ఈలోగా మంత్రుల పేషీలు ఖాళీ చేయాలని నిర్దేశించింది.
ఈ చర్యపై అధికార పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం కొలువు తీరేవరకూ ప్రస్తుత మంత్రివర్గం ఆపద్దర్మంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే మంత్రులు నామమాత్రంగానే ఉంటారు. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఓ ఉత్తర్వును జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.