ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సు లను మానవతా దృక్పధంతో అనుమతించాలని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్య సదుపాయాలు ఎక్కువగా వున్న నగరాలకు పేషెంట్లు వెళ్ళడం సాధారణంగా జరిగేదే అన్న సజ్జల.. అంబులెన్సులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. అంబులెన్సులు అడ్డుకోవద్దని హైకోర్టు చెప్పిన విషయాన్ని అయన ప్రస్తావించారు.
తమిళనాడు, చెన్నై సరిహద్దుల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని, ఒక్క తెలంగాణా విషయంలోనే ఇలాంటి సమస్య ఎదురవుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎక్కడ సదుపాయం వుంటే అక్కడకు తమవారిని తీసుకెళ్లాలని రోగి బంధువులు ఆలోచిస్తారని అన్నారు.
ఆపద సమయంలో పాసులు, ఆస్పత్రి నుంచి లెటర్లు తీసుకురావడం సాధ్యపడదని, తెలంగాణా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించడం కష్టమని, ఈ విషయంలో పునరాలోచించాలని సజ్జల కోరారు. ఎవరూ ఆవేశాలకు పోయి ఘర్షణ వాతావరణం సృష్టించడం మంచిది కాదన్నారు. తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ లో వైద్య సదుపాయాలు తక్కువ అందుబాటులో వున్నాయని, గత ప్రభుత్వం వైద్య రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయలేదని విమర్శించారు.