Sai Teja last rituals on tomorrow:
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన లాన్స్ నాయక సాయితేజ కుటుంబానికి అండగా ఉండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సాయి తేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాయితేజను ఆదుకునే విషయమై గురువారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు. సాయితేజ, అతని కుటుంబం వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన సైనికుడిగా అయన ఖ్యాతి గడించారని, అందువల్లే బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
సైనికుడి మరణానికి వెలకట్టామనే భావన రాకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కష్టంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నామంటూ హడావిడి చేయవద్దని సిఎం అధికారులకు సూచించారు. దీనిపై మీడియాలో ఎలాంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దని ఆదేశించారు. సీనియర్ మంత్రిని పంపి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి, అక్కడే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సూచించారు.
కాగా, సాయి తేజ అంత్యక్రియలు రేపు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ సాయంత్రం భౌతిక కాయం వచ్చే సమయానికి చీకటి పడే అవకాశం ఉన్నందున నేడు అంతిమ క్రియలు జరపలేమని, బెంగుళూరు కంటోన్మెంట్ లో ఉంచి రేపు ఉదయం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Also Read : ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఏపీ వాసి మృతి