2021 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 31 లోపు పరీక్షల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, ఈలోగానే మూల్యాంకనం పూర్తిచేసి, మార్కుల జాబితా కూడా సమర్పించాల్సి ఉందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదని అందుకే పరీక్షలు రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. మార్కులు ఎలా కేటాయించాలి, దానికి ఏ విధమైన మార్గదర్శకాలు అవలంబించాలనే దానిపై ఒక హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అధికారులు అందించిన సమాచారం ప్రకారం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని, పరీక్షల ప్రకటనకు, నిర్వహించే తేదీకి మధ్య కనీసం 15 రోజుల సమయం ఉండాలని, ప్రస్తుతం అది సాధ్యపడదని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో చర్చిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ విషయాన్నే రేపు సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేస్తామన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సి బి ఎస్ ఈ బోర్డు కూడా పరీక్షలు రద్దు చేసినందున మన రాష్ట్ర విద్యార్ధులకు ఎలాంటి నష్టం ఉండబోదని మంత్రి సురేష్ చెప్పారు.
మేం మొదటినుంచీ పరీక్షలు నిర్వహించాలనే అనుకున్నామని, కోవిడ్ తగ్గింది కాబట్టి నిబంధనలు పాటిస్తూ నిర్వహణకే మొగ్గు చూపామని అదే విషయాన్ని నేటి ఉదయం కోర్టుకు కూడా తెలిపామని, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు వల్లే, తప్పని పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోయిందన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు.