ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై అమరావతి రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం రాజ్యంగ వ్యతిరేకమంటూ కొట్టివేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు శాసనవ్యవస్థ కున్న అధికారాలను ప్రశ్నించడమేనని, హైకోర్టు చెప్పిన విధంగా అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో స్పష్టం చేసింది. అధికార, పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కొసమే తాము మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
అమరావతి రైతులు అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మొన్న గురువారం అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వ విధానాన్ని మరోసారు పునరుద్ఘాటించారు. తాజాగా భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయంశామైంది.