జనవరి 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఉచితంగా మందులు డోర్ డెలివరీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్ పంపితే వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు పోస్టల్ సర్వీసు ద్వారా విలేజ్ క్లినిక్‌కు అందుతాయని… ఆరోగ్య సిబ్బంది వాటిని రోగులకు అందజేస్తారని సిఎం వెల్లడించారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించే కార్యక్రమానికి సిఎం జగన్ నేడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:
* ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుంది
* దేశంలో ఎక్కడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువచేస్తున్నాం:
* వైద్యంకోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ ఉండదు
* ఆరోగ్యశ్రీ కింద ఉచితవైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం
* దీనిపై ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
* ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
* సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలనుకూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం
* 1.4 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
* 1059 ప్రొసీజర్లకు మాత్రమే గతంలో ఆరోగ్యశ్రీ వర్తించేంది, ఇప్పుడు 3257 ప్రొసీజర్లకు ఇస్తున్నాం
* వెయ్యి రూపాయలు దాటి ఖర్చయ్యే ప్రొసీజర్లన్నింటీనీ ఆరోగ్య శ్రీ కిందకు తీసుకువచ్చాం
* గతంలో 748 కే పరిమితమైతే ఇప్పుడు 2513 ఆస్పత్రులకు (ఇతర రాష్ట్రాల్లో కలిపి) విస్తరించాం
* హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు వర్తింపు చేశాం
* ప్రివెంటివ్ కేర్‌ను విప్లవాత్మకంగా తీసుకువచ్చి 10032 విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తెచ్చాం
* 24 గంటల సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి
* ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ద్వారా మండలానికి నలుగురు డాక్టర్లను అందుబాటులో ఉంచాం
* ఇద్దరు పీహెచ్‌సీల్లో ఉంటే, మరో ఇద్దరు ఫ్యామిలీ డాక్టర్ సేవలకు వెళ్తున్నారు
* విలేజ్ క్లినిక్స్‌తో వీరు అనుసంధానం అయ్యారు
* అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపట్టాం
* ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలు వివరంగా చెప్పే కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం
* ఇందుకోసం రేపటినుంచి నియోజకవర్గంలో 5 గ్రామాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రచారం ప్రారంభం
* ప్రతి ఇంటికీ ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాక సేవలు ఎలా పొందాలన్నదానిపై వివరాలు చెప్పాలి
* కనీసం ఒకరి ఫోన్ లో నైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్ లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ చేయాలి
* ప్రతివారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున కార్డుల పంపిణీ, ప్రచారం కార్యక్రమం జరగాలి
* ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవాళ్లు, పాల్గొంటారు
* ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, మహిళా పోలీసులుకూడా పాల్గొని దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేయాలి
* ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండాలి
* ఈ రెండూ కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను