సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం స్పెషల్ ఆఫీసర్, సిఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాలు పర్యవేక్షించే డా. మామిడి హరికృష్ణ అపోలో ఆస్పత్రికి ఎల్వోసీ (లెటర్ అఫ్ కన్ఫర్మేషన్) పంపించారు. కత్తి మహేష్ కు అవసరమైన వైద్య చికిత్స అందించాలని హరికృష్ణ కోరారు. చికిత్స పూర్తయిన తర్వాత ఆస్పత్రి అకౌంట్ వివరాలతో కూడిన బిల్స్ ను పంపితే సదరు మొత్తాన్ని రిలీఫ్ ఫండ్ నుంచి జమ చేస్తామని లేఖలో పేర్కొన్నారు.
జూన్ 26 తెల్లవారుజామున కత్తి మహేష్ ప్రయాణిస్తున్నవాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అయన ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోడంతో మహేష్ తల భాగంలో, కంటికి తీవ్ర గయాలయ్యాయి. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఆయన్ను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆపత్రికి తరలించారు.
అపోలో ఆస్పత్రిలో ముక్కు ఎముకకి, నుదురుకి, కంటికీ చేసిన శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయి. త్వరలోనే మహేష్ ఆస్పత్రి నుంచి డిస్ఛార్జ్ అవుతారని తెలిసింది.