రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ కర్ఫ్యూకు సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20 నుంచి ఈ సడలింపు అమల్లోకి వస్తుంది. సాయంత్రం 5 గంటలు కల్లా షాపులు మూసివేయాలి, సా. 6 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ మాత్రమే సడలింపు ఉంటుంది.
ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై సాధారణ సమయాల్లోనే పనిచేస్తాయి, మినహాయింపులు ఏవీ ఉండవు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన తాజా సడలింపులు జూన్ 30వ తేదీ వరకూ అమల్లో ఉంటాయి. ఆ తర్వాత మరోసారి సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారు.