వైద్య విద్యకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య కళాశాలలు, డెంటల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో వంద శాతం ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో హెల్త్ యూనివర్శిటీ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తోంది. ఆల్ ఇండియా కోటాలో భర్తీ అయ్యే సీట్లుకాకుండా మిగిలిన సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం అన్ రిజర్వుడ్ విభాగాల కింద భర్తీ చేసేవారు. ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ఉండేవి. ఈ సీట్లలో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేసేవారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పడిన కళాశాలలు, కొత్తగా మంజూరైన సీట్లలో 15 శాతంలోనూ తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలు పొందొచ్చు. స్థానికత విషయంలో నిబంధనలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేరే రాష్ట్రంలో చదువుకున్న కాలం మినహాయించి రాష్ట్రంలో పదేళ్లు నివసించిన విద్యార్థులు, పదేళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన పౌరుల పిల్లలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు కూడా స్థానిక కోటాలో అవకాశం కల్పిస్తారు.