పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఫిబ్రవరి 16న తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫాం “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం జరగనుంది.
టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఒప్పందం రాష్ట్ర విద్యా వ్యవస్థలోనే ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
“ఎడెక్స్ ఒప్పందం” ముఖ్యాంశాలు
- మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఆయా సంస్థల అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందింఛే వీలుంటుంది.
- హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ.. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ-అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
“ఎడెక్స్ ఒప్పందం”తో ప్రయోజనాలు
- ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను మన విద్యార్థులు ఉచితంగా నేర్చుకునే అవకాశం. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే వీలు కలుగుతుంది.
- విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, యుసి బర్క్ లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు.
- ప్రొఫెషనల్, సాంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి– విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యసనా నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్ సహకారం.