స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబర్ 31న అనారోగ్య కారణాలతో బాబుకు నాలుగు వారాల పాటు (నవంబర్ 28 వరకూ) మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇష్టం వచ్చిన చోట, సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చని, 28న రాజమండ్రి జైలులో లొంగి పోవాలని సూచించింది. అయితే బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బాబు తో పాటు ఏపీ సిఐడి తరఫున వాదనలు వినిపించారు. గతవారం విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇస్తామని న్యాయమూర్తి కోర్టు వెల్లడించింది.
రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, రాజకీయ పరమైన చర్చల్లో పాల్గొనకూడదని మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంలో విధించిన నిబంధనలు ఈ నెల 28 వరకూ అమల్లో ఉంటాయని, 29 నుంచి నిబంధనలు తొలగిపోతాయని సింగల్ బెంచ్ ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసిది.
సెప్టెంబర్ 8న బాబును ఈ కేసులో అరెస్టు చేసి 9న ఏసీబీ కోర్ట్ ఎదుట హాజరు పరిచారు. 52 రోజుల పాటు అయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.