Housing scheme to resume:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ళ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. మరోవైపు ఈ పథకంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కూడా పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. దీనితో హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. గత కొన్ని నెలలుగా ఆగిపోయిన ఇళ్ళ నిర్మాణం మళ్ళీ మొదలు కానుంది.
ఇళ్ళ పట్టాలను కేవలం స్త్రీల పేరుమీదనే కేటాయించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంట్ స్థలంలోనే ఇళ్ళ నిర్మాణానికి కేటాయించడం సరికాదని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. దీనివల్ల భవిష్యత్తులో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తాయని… డ్రైనేజి సదుపాయం, మంచినీటి సరఫరాలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ఈ సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ నియమించాలని సూచించింది. కమిటీ నివేదిక ఇచ్చేంత వరకూ నిర్మాణాలు ఆపాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా ఈరోజు తీర్పు వెల్లడించింది.