2023 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామని, రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నామని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెట్టి ఇటీవలే కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్ పోర్టును ప్రారంభించామన్నారు. ఐ.టీ కి సంబంధించి 3 కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలుసిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి..ప్రజలకు ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధిపై మేకపాటి ప్రజంటేషన్ ఇచ్చారు
ఆగస్ట్ లో మరోసారి టెక్స్ టైల్, ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. 65 లార్జ్ , మెగా ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి.. 45 వేలమందికి ఉద్యోగాలు అందించగలిగామని, తద్వారా 30 వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చామని, పీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని మేకపాటి వెల్లడించారు,.
సీఎం జగన్ ముందుచూపు, స్పష్టమైన ఆలోచనల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. త్వరలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇప్పటికే 2020-21 ఏడాదికిగాను జనవరి, ఫిబ్రవరి నెలల కాలానికి రూ.1032 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రూ.18000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని మీడియాకు వివరించారు. కరోనా సంక్షోభంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం అండగా నిలిచిందని..అలా చేసిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని మంత్రి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఎమ్ఎస్ఎమ్ఈలకు కష్టకాలంలోనూ చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ క్లస్టర్ల ఏర్పాటు దిశగా ముందుకువెళుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి చెప్పారు. జులైలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మలివిడతలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు వస్తాయని వివరించారు.
గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది జరుగుతున్న ప్రచారం అబద్ధమని మంత్రి మేకపాటి క్లారిటీ ఇచ్చారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు హక్కులు ఉంటాయని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చారు. పోర్టు ఒప్పంద కాలం పూర్తి అయిన తర్వాత అంటే 36 ఏళ్ల తర్వాత గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
30 స్కిల్ కాలేజీలకు త్వరలోశంకుస్థాపన: గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలోని యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతోపాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ చొప్పున 25, 4 త్రిపుల్ ఐటీలు, పులివెందుల జేఎన్టీయూలో కలిపి మొత్తం 30 స్కిల్ కాలేజీలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.
పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి జూన్ 8 నాటికి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సత్కరించారు. శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు.