కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామల రావు వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్ నుంచి రెండు నెలలలోపే కృష్ణా, గోదావరి నదుల పరిథిని నోటిఫై చేయాల్సి ఉందని, అలా చేయని కారణంగా రెండు రాష్ట్రాలు కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయని వివరించారు. ఒప్పందాలకు విరుద్ధంగా, ఎలాంటి సమాచారం లేకుండా జూన్ 1 నుంచి తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రారంభించిందని గుర్తు చేశారు. తెలంగాణా చర్యల వల్ల శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోయిందని, 8 టిఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందని అయన వివరించారు. శ్రీశైలంలో జూన్ 1 నుంచి 30.38 టిఎంసి ల ఇన్ ఫ్లో ఉంటే, 29.82 టిఎంసి ల నీటిని తెలంగాణా విద్యుత్ కోసం వినియోగించిందని తెలిపారు. తెలంగాణా తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేఆర్ఎంబికి సిఎం జగన్ లేఖలు రాశారని శ్యామలరావు చెప్పారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఈ.ఎన్.సి. నారాయణరెడ్డితో కలిసి విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిన్న (జూలై 15) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నోటిఫికేషన్ లో కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉందని శ్యామల రావు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును అనుమతి లేని ప్రాజెక్టుగా చూపారని, దీన్ని సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన చట్టంలో ఉన్నట్లుగా కృష్ణా రివర్ మేనేజేమెంట్ బోర్డు కార్యాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోనే ఏర్పాటు చేయాల్సి ఉందని, దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల నుండి నీటి కేటాయింపులు చేశాక ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హక్కు అని పేర్కొన్నారు.