Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

తెలంగాణ మంత్రుల తీరు సరికాదు : అనిల్

ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై, దివంగత నేత వైఎస్సార్ పై తెలంగాణా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తమ నాయకులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, తామూ మాట్లాడగలమని, అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం జగన్ చెప్పినందుకే తాము ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రిగా అనిల్ పాల్గొన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అనిల్ స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి  ప్రాజెక్టులు అక్రమంగా కడుతోందని, ఈ విషయమై అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని అనిల్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మొద్దు నిద్ర పోయిందని ఆయన ఆరోపించారు.

ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని అనిల్ మండిపడ్డారు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదని మరోసారి అనిల్ పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్