కృష్ణాజలాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కృష్ణాజలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా రైతాంగానికి ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణతో కృష్ణా జలాల వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలన్నది తమ అభిమతమన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణా ప్రభుత్వం కూడా ఇదే విధానంతో వుండాలని బొత్స హితవు పలికారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయ భవనంలో కొత్తగా నిర్మించిన రెండు, మూడో అంతస్థులను సోమవారం బొత్స ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.ఎల్.సి. సురేష్‌బాబు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులతో కలసి నూతన కౌన్సిల్ హాలులో మీడియాతో మాట్లాడారు.
నీటి వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్, చట్టాలు ఉన్నాయని వాటికి అనుగుణంగా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలన్నారు. నదీజలాలపై మన రాష్ట్రానికి ఉన్న న్యాయమైన హక్కులను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మనసు మార్చుకొని విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగాన్ని ఆపాలని కోరారు.
తుదిదశకు అమరావతి విచారణ
అమరావతి భూముల అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఈ విచారణ తుదిదశకు చేరిందన్నారు బొత్స. అక్రమాలపై చర్యలు తీసుకొనే సమయంలో సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకొని కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నారని మంత్రి చెప్పారు. అమరావతి భూముల విషయంలో తప్పు జరిగిందని, బలహీనవర్గాల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, ఇది వాస్తవమని మంత్రి పేర్కొన్నారు.