Saturday, January 18, 2025
HomeTrending Newsవైసీపీకి గుమ్మనూరు గుడ్ బై

వైసీపీకి గుమ్మనూరు గుడ్ బై

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎంపి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, తన నియోజకవర్గ ప్రజలు, తన అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ అనే శిల్పానికి సజ్జల రామ కృష్ణా రెడ్డి, దనునంజయ రెడ్డి పూజారులుగా వ్యవహరిస్తున్నారని, వారిద్దరూ తమ లాంటి నేతలను వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశంలో చేరుతున్నానని, గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని తెలిపారు.  ఈ సాయంత్రం తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో మంగళగిరిలో జరుగుతోన్న జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో జయరాం టిడిపిలో చేరనున్నారు.

వాల్మీకి సామాజిక వర్గానికి చెందినా గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి తొలుత 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి గెలిచిన జయరాం  వైఎస్ జగన్ మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2022 ఏప్రిల్ లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జయరాం కు ఉద్వాసన తప్పదని భావించినా వాల్మీకి సామాజిక వర్గం సమీకరణలను దృష్టిలో పెట్టుకొని జగన్ ఆయన్ను కొనసాగించారు. ఆలూరు టికెట్ ను ఈసారి జడ్పీటీసీ సభ్యుడు  విరూపాక్షకు కేటాయించారు. జయరాం ను కర్నూలు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని జగన్ సూచించారు. అప్పటినుంచి పార్టీపై అసంతృప్తిగానే ఉన్న జయరాం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో బీవై రామయ్యను కర్నూల్ ఎంపి అభ్యర్ధిగా కూడా వైసీపీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జయరాం పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్