ఢిల్లీ నుంఛి ఏదో ఒక నాయకుడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి విమర్శలు చేయించడం రాష్ట్ర బిజెపి నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో కలిసి పనిచేసి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా యువతకు ఇక్కడిలాగా ఉపాధి కల్పించారా అని ప్రశ్నించారు. రెండు లక్షల మందికి వాలంటీర్లుగా నియమించి ప్రజలకు సేవలందిస్తున్నారని… గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో లక్షన్నర మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు విజయవాడలో జరిగిన సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలపై జోగి రమేష్ స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి ఓటేయమని అడిగే హక్కు అసలు బిజెపి ఉందా అని నిలదీశారు. ఏపీలో పర్యటించి, సుజనా చౌదరి సూచనలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్ట్ చదివి వెళ్ళడం తప్ప వారికి ఈ రాష్ట్రం గురించి ఏం అవగాహన ఉందని నిలదీశారు. ఈ రాష్ట్రంలో కేఏ పాల్ కు ఎంత విలువుందో బిజెపికి కూడా అంతే ఉందని ఘాటుగా విమర్శించారు. అవినీతికి తాబేదారు, అవినీతి చక్రవర్తి చంద్రబాబు అయితే, మంచికి మారుపేరు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు.
ఈ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని అనురాగ్ చేసిన వ్యాఖ్యలను జోగి ఎద్దేవా చేశారు. అసలు విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని అడిగారు. ఈ రాష్ట్రానికి వచ్చేముందు ప్రత్యేక హోదా హామీ ఏమైందో తెలుసుకొని రావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, లోటు బడ్జెట్ విషయంలో ఏపీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ రాజకీయాలతో ఏపీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఏపీలో అది సాగబోదని స్పష్టం చేశారు.