సిఎం జగన్ సొంత ఖర్చులతో లండన్ పర్యటనకు వెళ్తే ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ టిడిపి నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఘాటుగా విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా బులెట్ ప్రూఫ్ బస్సుకు ఐదున్నర కోట్లు, సిఎం ఆఫీసుకు పది, లేక వ్యూ గెస్ట్ హౌస్ కు మరో పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, విదేశీ పర్యటనలకు వందల కోట్లు, నవనిర్మాణ దీక్షల కోసం మరో యాభై కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారని వివరించారు. సిఎం జగన్ ఒక్క రూపాయి కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయబోరని స్పష్టం చేశారు. నాలుగున్నర ఏళ్ళలో ప్రజలకు 2 లక్షల 37 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో డిబిటి ద్వారా జగన్ అందించారని, వీటిలో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అమరావతి రాజధానిలో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టి 119 కోట్లు ముడుపులు తీసుకున్నారని, దీనిపై ఐటి నోటీసులు ఇస్తే ఎందుకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. తనను అరెస్టు చేస్తారంటూ బాబు చెప్పడం హేయమన్నారు. పేద ప్రజల సొమ్మును కాజేసిన చంద్రబాబు లాంటి దొంగను అరెస్టు చేసి తీరాలని మేరుగ డిమాండ్ చేశారు. మా బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన నిధులు దోచుకున్న బాబును ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇన్నాళ్ళూ ఏం పీక్కుంటారో పీక్కోవాలని ప్రగల్భాలు పలికిన తండ్రీ కొడుకులు ఇప్పుడు ఐటి నోటీసులపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.