Sunday, September 8, 2024
HomeTrending Newsపరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటు: మంత్రులు

పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటు: మంత్రులు

రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై భూగర్భగనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిలు సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని డోలమైట్, లైమ్, సిలికాశాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ వనరుల లభ్యతపై సమీక్షించారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సిలికా శాండ్‌ను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూసే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్బంగా మంత్రులు తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అత్యంత సరళతరం చేస్తూ, పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపుదల కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు పారదర్శక విధానాన్ని తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నెల్లూరు, కర్నూలు జిల్లాలో గ్లాస్‌ పరిశ్రమలకు ఉపయోగించే సిలికాశాండ్ నిల్వలు ఉన్నాయని, అలాగే డోలమైట్, లైమ్ ఖనిజ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. వాటిని వినియోగించుకునేందుకు పలు భారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. అటువంటి పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ రవిచంద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్