రెండు వేల రూపాయల నోటును రద్దు చేయడం సాహసోపేత చర్యగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. అసలు ఈ నోటు చాలా కాలం నుంచి కనబడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ రద్దు మూలంగా సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదని దీనికి గాను ఆర్బీఐను అభినందించాలన్నారు. అవినీతిపై మోడీ ప్రభుత్వం సమరశంఖం పూరిస్తుందన్న విషయం తేటతెల్లమైందన్నారు. దీనిపై గతంలోనే తమ పార్టీ నేత విష్ణు కుమార్ రాజు రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా కు లేఖ కూడా రాశారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశానికి సోము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, సిఎం వరకూ అంతా అవినీతి మాయమైందని అన్నారు. ఛార్జ్ షీట్ దాఖలు కార్యక్రమంలో ఎన్నో విషయాలు బైటపడ్డాయని చెప్పారు.
ఉద్యోగులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, ప్రస్తుతం ఎన్జీవో నేతలంతా కార్మిక సంఘ నేతలుగా మారారని, వారు నిరంతరం జీతాల కోసమే పోరాడాల్సి వస్తోందని సోము విమర్శించారు. ప్రజలకు అతి దగ్గరగా ఉన్న ఉద్యోగ వ్యవస్థ నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిష్తితి లేదని అన్నారు. గ్రామం నుంచి పట్టణం, నగరం వరకూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం చేస్తోంది మోడీ ప్రభుత్వం మాత్రమేనన్నారు.