తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల క్రితం హత్యకు గురైన ముప్పాళ్ళ మండలం గొల్లపాడుకు చెందిన విద్యార్ధిని కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు అయన నరసరావుపేట పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న లోకేష్, ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదని తెలియజేశారు. లోకేష్ తో పాటు టిడిపి నేతలు ససేమిరా అనడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాలిబన్లను తలదన్నే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సిఎం జగన్ చేతిలో చెంచాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నరసరావు పేటలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నిన్నటి నుంచే పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని, నేతలను గృహనిర్భంధం పేరుతో బైటకు వెళ్ళనీయడంలేదని పేర్కొన్నారు. వెంటనే టిడిపి నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
డిజిపి గౌతమ్ సావాంగ్ పరువు పూర్తిగా గంగలో కలిసిపియిందని, ఈ రోజుతో ఇంకా దారుణంగా పరువు పోగొట్టుకున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దిశా చట్టం అమలవుతోందని, ఇప్పటికే ముగ్గురికి శిక్షలు పడ్డాయని హోం మంత్రి చెప్పారని, కానీ డిజిపి మాత్రం దిశా చట్టం అమల్లో లేదని, కేవలం యాప్ ఉందని చెప్పారని అయన తెలిపారు. తానూ ఓ యాప్ తయారు చేయగలనని, దిశా చట్టం గురించి అడుగుతుంటే అంత ఉలుకెందుకని నిలదీశారు. ఇప్పటికైనా పోలీసులు గౌరవంగా లోకేష్ ను నరసరావుపేట పర్యటనకు తీసుకెళ్లాలని సూచించారు.