Saturday, January 18, 2025
HomeTrending Newsఏపి ప్రాజెక్టులు ముమ్మాటికి అక్రమమే

ఏపి ప్రాజెక్టులు ముమ్మాటికి అక్రమమే

గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ,రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7 .7 టీఎంసీ ల తరలింపునకు జగన్ కుట్ర పన్నారని విమర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ,ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు ,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ రోజు  టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ కు మంచి నీళ్లు కూడా కష్టమేనని, నల్గొండ, మహబుబ్ నగర్, ఖమ్మం జిల్లాల సాగు నీటి ప్రయోజనాలు దెబ్బ తింటాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలలోనే అన్ని ఆధారాలతో కృష్ణా రివర్ బోర్డు కు లేఖరాశారని, ఆ లేఖ ఫలితంగానే కృష్ణా రివర్ బోర్డు ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపమని ఆదేశించిందని మంత్రి వివరించారు. నన్ను విమర్శించిన ఏపీ నేతలకు కృష్ణా బోర్డు ఆదేశం కను విప్పు కలిగించాలన్నారు. ఏపీ ప్రభుత్వం మే 2020 లోనే పోతిరెడ్డి పాడు విస్తరణకు ,రాయల సీమ లిఫ్ట్ పథకం కోసం జీవో ఇచ్చిందని, ఆ జీవో వచ్చినా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ ,బీజేపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే మే 11 న రాష్ట్రప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు కు లేఖ రాసిందని మంత్రి వేముల పేర్కొన్నారు. ఢిల్లీ లో ఎన్ని వేదికలున్నాయో అన్నిటికి తెలంగాణ ప్రభుత్వం ఏపీ అక్రమ ప్రాజెక్టుల పై పిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ ,బీజేపీ నేతలకు మా చిత్తశుద్ధి పై మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ నాయకుల పాపమే పోతిరెడ్డి పాడు విస్తరణ అని వైఎస్ హాయం లో పోతిరెడ్డి పాడు సామర్ధ్యం 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెరగడం తెలంగాణ కాంగ్రెస్ నేతల అసమర్థత కాదా ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు ?

పోతిరెడ్డి పాడు నీళ్ల తరలింపునకు అప్పటి మంత్రి డీకే అరుణ హారతులు పడితే,  పొన్నాల  లక్ష్మయ్య ఇరిగేషన్ మంత్రి గా స్వాగతించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మంత్రులు పోతిరెడ్డి పాడును వ్యతిరేకిస్తూ వై ఎస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఏపీ అక్రమ ప్రాజెక్టు లు ఆపే భాద్యత లేదా ? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి ప్రాజెక్టుల కు మద్దతుగా మాట్లాడితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు బదులు ఇవ్వటం లేదని మంత్రి ప్రశ్నించారు.

వైఎస్ఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. 2004 లో టీ ఆర్ ఎస్ పొత్తు పుణ్యాన వై ఎస్ సీఎం కాగలిగారని ఆనాడు చంద్రబాబును ఓడించేందుకు కెసిఆర్ ఇంటికి పొత్తు కోసం ఆజాద్ రాలేదా ?.  తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వై ఎస్న ఈ ప్రాంతానికి దేవుడు ఎలా అవుతారని వేముల మండిపడ్డారు.

వై ఎస్ తెలంగాణ కు పనికిరాని ప్రాజెక్టుల ను ప్రతిపాదించి ఏపీ కి పనికొచ్చే ప్రాజెక్టులను తొందరగా పూర్తయ్యేలా చేశారని ఆరోపించారు. వైఎస్ హయంలో తెలంగాణకు 71 టీఏంసి ల ప్రాజెక్టులు ప్రతిపాదించి పూర్తి చేయలేకపోయారు.

నన్ను డీకే అరుణ బచ్చా అంటోందని ఆమె మాదిరిగా సమైక్య పాలకుల మోచేయి నీళ్ళు నేను తాగ లేదని మంత్రి అన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు ల పై తెలంగాణ రాజకీయ సమాజం ఒక్కటి కావాలని ప్రశాంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

వై ఎస్ గొర్రెలు తినేటోడైతే జగన్ బర్రెలు తినేటోడని విమర్శించిన  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృష్ణా జలాల కోసం రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ సస్య శ్యామలం కావడం ఇష్టం లేకే జగన్ అక్రమ ప్రాజెక్టులు మొదలు పెట్టారని ఆరోపించారు. జగన్ తప్పటడుగులు వేస్తే ఆయనకు చంద్రబాబు గతే పడుతుందన్నారు.

కృష్ణా నీళ్లకు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధం లేదని  ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కేంద్రంలోబీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. జగన్ బీజేపీ ట్రాప్ లో పడొద్దని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్