త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ కోసం ఈ పాలసీని తెస్తున్నామని, రాష్ట్రంలో మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ (ఎస్ఎల్ సీసీ) ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
ఐ.టి.కి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లను నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పుల దృష్ట్యా మరోసారి ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులను కలవాలని నిర్ణయించారు.
వచ్చేవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమీక్ష సమావేశం ఉన్నందున, పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారి వివరాలను ముఖ్యమంత్రికి వివరించేందుకు జాబితాను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు:
- మేజర్, మైనర్ పోర్టులు, కోల్డ్ స్టోరేజ్ లు, వేర్ హౌస్ లు, సరకు రవాణా వాహనాలు కీలకం. పాలసీ రూపకల్పనలో భాగంగా సింగపూర్ తరహా దేశాలలో మోడళ్ల పరిశీలనకు నిర్ణయం
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
- పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంపు సహా, నాన్ మేజర్ పోర్టులలో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026 కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళిక
- క్రిష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు
- ఏపీఐఐసీ భూములలో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి పరిశ్రమల శాఖ కృషి
- రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణణంలో సరకు రవాణాలో కీలకమైన ట్రక్ పార్కింగ్ బేల నిర్మాణం
- పార్కింగ్ బేలలో ఫ్యూయల్ స్టేషన్, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలకు ప్లాన్
- రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశం