గ్రూప్-1 మినహా ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరిక్షల నిర్వహణలో జాప్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలీం పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు. వీటిలో గ్రూప్ వన్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఏపీపీఎస్సీ గత ఏడాదిన్నర కాలంగా పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు.
త్వరలో 1184 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఇస్తామని సలీం ప్రకటించారు. ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని, రోస్టర్ పాయింట్లు ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందని సలీం అన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు, ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లకు సంబంధించి జీఓలు 150, 39లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని వివరించారు.
ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరారని, ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మార్చాల్సి ఉంటుందని అన్నారు.