Saturday, September 21, 2024
HomeTrending Newsమహిళలందరి కోసం ఆరోగ్య మహిళ పథకం - మంత్రి హరీశ్

మహిళలందరి కోసం ఆరోగ్య మహిళ పథకం – మంత్రి హరీశ్

మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారన్నారు. కరీంనగర్ వేదికగా ఈ రోజు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ఎవరూ అడగకముందే సీఎం కేసీఆర్ కేసీఆర్ కిట్స్ ప్రారంభించారు. కేసీఆర్ కిట్ ద్వారా 16 రకాల వస్తువులు ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం జరిగితే, ఇప్పుడు 61 శాతం జరుగుతున్నాయి. 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ ద్వారా పరిష్కారం లభిస్తుంది. పరీక్షలు చేస్తారు, మందులు, వైద్యం అందిస్తారు. వ్యాధి తీవ్రత బట్టి అవసరం మేరకు, ప్రభుత్వ పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. రిఫరల్ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం, అక్కడ కూడా ప్రత్యేకంగా మద్దతు అందించి చికిత్స అందిస్తారు. ప్రతి మంగళవారం పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ఉండి వైద్యం అందిస్తారు. ప్రస్తుతం 100 ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో 1200 సెంటర్లకు పెంచుతాం. మహిళల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వైద్యం, పరీక్షలు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. పేద మధ్య తరగతి మహిళలందరి కోసం ఈ ఆలోచన. మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. శ్రీరామ నవమి పండుగ వెళ్లగానే రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రీషన్ కిట్స్ అందిస్తాం. బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్స్, బిడ్డ పుట్టక ముందే న్యూట్రీషన్ కిట్ అందజేస్తాం. నెయ్యి, ప్రోటీన్ మిక్స్ పౌండర్, కర్జూర పండ్లు, గోళీలు ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని అందరు గర్బిణులకు ఇవ్వబోతున్నాం.

మాది న్యూట్రీషన్ పాలిటిక్స్, బిజేపి వాళ్లది పార్టీషన్ పాలిటిక్స్ కులం, మతం పేరుతో వారు విభజన చేయాలని చూస్తే, మేము సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నాం. ఒకనాడు నీళ్ల కోసం కొట్లాడుకున్న పరిస్థితులు. నీళ్లు మోసి మోసి భుజాలు నొప్పి పెడితే, బోరింగ్ కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టేవి.
ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే. కర్ణాటక, మహారాష్ట్ర ఏ రాష్ట్రానికి పోయినా, తెలంగాణ వంటి పథకాలు అమలు చేయాలని అడుగుతున్నారు. తెలంగాణ పథకాలు అమలు చేయకుంటే, మా ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. కరీంనగర్ ప్రజలకు శుభవార్త. ఈ ఏడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించబోతున్నాం. ఢిల్లీలోని బిజేపీ వాళ్లు మొండి చేయి చూపారు. కరీంనగర్ కు మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇవ్వలేదు. అందుకే 500 కోట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తున్నాం. ఇదే సమయంలో నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభిస్తాం. వైద్యంతో పాటు వైద్య విద్యను మీ చెంతకే తెస్తున్నాం.

ఆరోగ్య మహిళను సద్వినియోగం చేసుకోవాలి. సి సెక్షన్లు ప్రోత్సహించకూడదు. ముహుర్తాలు పెట్టి చేయడం వల్ల తల్లి, బిడ్డకు నష్టం జరుగుతుంది. సి సెక్షన్లు చేసుకున్న మహిళ అనారోగ్యం పాలవుతుంది. బిడ్డకు మొదటి గంటలో ముర్రు పాలు అందదు. వైద్యుల నిర్ణయమే ఫైనల్. అందులో దయచేసి జోక్యం చేసుకోవద్దు. సి సెక్షన్ల విషయంలో కరీంనగర్ టాప్లో ఉంది. తగ్గించాలి. మార్పు రావాల్సింది వైద్యుల్లో కాదు, కుటుంబ సభ్యుల్లో రావాలి. గర్బిణులు మాత్రమే కాదు, తల్లి, భర్త, అత్తగారు ఆలోచించి. మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా అందరం కలిసి పని చేయాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్