Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిడాకులకు సోషల్ మీడియానే ప్రధాన కారణం

విడాకులకు సోషల్ మీడియానే ప్రధాన కారణం

పెళ్లి.. నూరేళ్ల బంధం. కానీ ఈ రోజుల్లో ఆ బంధం కొన్ని గంటల్లోనే తెగిపోతోంది. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మీ ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా యాప్స్! అవును, సోషల్ మీడియా ఇప్పుడు ఎన్నో వివాహాలకు అడ్డంకులు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక సంఘటన ఈ చేదు నిజాన్ని బయటపెట్టింది.

ఇండోర్‌లో కేవలం 40 రోజుల్లో ఏకంగా 150 పెళ్లిళ్లు రద్దయ్యాయి. ఇది చిన్న విషయం కాదు. ఈ రద్దులకు గల కారణాలు ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ 150 కేసుల్లో 60 నుంచి 70 శాతం వివాహాలు రద్దు కావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సోషల్ మీడియానే కారణమని తేలింది.

ఒకప్పుడు పెద్దలు అటు ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు కాబోయే దంపతుల ప్రొఫైల్స్, పోస్ట్‌లు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వారి వ్యవహార శైలి, వారు పెట్టిన పాత పోస్ట్‌లు, ఇతరులతో వారి కామెంట్లు, ఉపయోగించిన ఎమోజీలు, స్నేహితుల జాబితాలు.. అన్నీ పరిశీలనకు వస్తున్నాయి. గతంలో చేసిన సరదా కామెంట్స్ లేదా పాత సంబంధాల తాలూకు ఆనవాళ్లు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకరి ఆన్‌లైన్ జీవితంపై మరొకరికి ఏవేవో భయాలు మొదలవుతున్నాయి. మనుషుల వ్యక్తిత్వం మొత్తం వారి సోషల్ మీడియా ప్రొఫైల్‌లోనే ఉందని భావిస్తున్నారు. ఈ చిన్నపాటి అపార్థాలు, అనుమానాలు పెరిగి పెద్దవై.. పెళ్లిని రద్దు చేసుకునేదాకా వెళ్తున్నాయి.

గుజరాత్‌కు చెందిన ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఇండోర్ లో కలిశారు. ఆ సమయంలో వధువు సోషల్ మీడియా ఖాతాలో కొన్ని సంవత్సరాల క్రితం పెట్టిన పాత పోస్ట్‌ల గురించి వరుడు గొడవకు దిగాడు. మాటమాట పెరిగి.. చివరికి ఇద్దరూ పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నూరేళ్లకు బలపడాల్సిన బంధం ఒక పాత పోస్ట్ కారణంగా అలా ముగిసిపోయింది.

సాంకేతికత మన జీవితాలను సులభతరం చేయాలి కానీ, బంధాలను నాశనం చేయకూడదు. పెళ్లికి ముందు కేవలం ఆన్‌లైన్ ప్రొఫైల్స్ చూసి ఒక నిర్ణయానికి రాకుండా, ఇద్దరూ నేరుగా మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular