భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో నేడు, రేపు (శని, ఆదివారాలు) ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే. నివాస్ వెల్లడించారు. ఈ రెండ్రోజులు సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని కలెక్టర్ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ తొమ్మిది రోజులపాటు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులయ్యారు. నిన్న సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు.