సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. ఈ నాలుగు సినిమాలలో కథానాయికల స్థానాల్లో శ్రీలీల .. ఆషిక రంగనాథ్ .. శ్రద్ధా శ్రీనాథ్ .. అమృత అయ్యర్ కనిపించారు. ‘గుంటూరు కారం’లో శ్రీలీల తనదైన స్టైల్లో హుషారైన స్టెప్స్ తో ఆకట్టుకుంది. ఇక ‘సైంధవ్’ సినిమాలోగానీ .. ‘హను మాన్’ సినిమాలోగాని హీరోయిన్స్ పాత్రలు నామ మాత్రంగానే కనిపిస్తాయి. ‘నా సామిరంగా’ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆషిక రంగనాథ్ కి ప్రాధాన్యత కలిగిన పాత్ర పడిందనే చెప్పాలి.
ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. ‘వరలక్ష్మి’ పాత్రలో ఆషిక రంగనాథ్ కనిపిస్తుంది. కథ అంతా కూడా తెరపై సంక్రాంతి పండుగతో ముడిపడే నడుస్తుంది. 1988లో .. అప్పటి గ్రామీణ వాతావరణంలో నడిచే కథ ఇది. అందువలన హీరోయిన్ ను పరికిణీలలో .. చీరకట్టులో చూపించారు. చాలా నాజూకుగా కనిపిస్తూ .. ఆకర్షణీయమైన కళ్లతోనే హావభావ విన్యాసాలు చేస్తూ ఆషిక ప్రేక్షకుల మనసులను దోచేస్తుంది. థియేటర్ నుంచి బయటికి వచ్చే యూత్, ఆషిక కోసం ఈ సినిమా చూడొచ్చు అనుకోవడం ఖాయం.
ఆషిక రంగనాథ్ కి తెలుగులో ఇది రెండో సినిమానే అయినా, ఇంతకుముందు ఆమె కన్నడ సినిమాలు చేసింది. అందువలన నటన విషయంలో ఆమెకి కొత్తేమీ లేదు. నాగార్జున సరసన ఆమె బాగానే కుదిరిపోయింది. అలాగే పల్లెటూరి యువతి కట్టూ బొట్టూలైను ఆమె చాలా అందంగానే కనిపించింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. కనుక ఈ సినిమా తరువాత ఆషిక రంగనాథ్ బిజీ అయ్యే అవకాశాలైతే పుష్కలంగానే కనిపిస్తున్నాయి.