నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దంగేటి జాహ్నవి రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటించి రాత్రి రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ బసచేసి నేటి ఉదయం చింతూరు పర్యటనకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి…పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది జాహ్నవి.
భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నట్లు జగన్ కు జాహ్నవి వివరించింది. దీనిపై సిఎం సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.