గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని… ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మనకు పదవి ఇవ్వలేదని, కేవలం బాధ్యత ఇచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో సభ్యులందరికీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, అందరూ తమ వాణిని సభలో వినిపించాలని.. మన కోసం కాకుండా రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి కోసం మాట్లాడాలని సూచించారు. తమ ఎమ్మెల్యే సభలో ఏమి మాట్లాడతారో అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, వారి ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను అభినందిస్తూ పలువురు సభ్యులు సభలో మాట్లాడిన అనంతరం అయ్యన్న తన స్పందన తెలియజేశారు. తనను ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సభకు ఎంతో విశిష్టత ఉందని, 22 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారని… 33 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు; 55 ఏళ్ళ లోపు వారు 57 శాతం మంది ఉన్నారని తెలిపారు. 88 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, నూతన మంత్రివర్గంలో 9 మంది తొలిసారి ఎన్నికైన వారికి అవకాశం ఇచ్చారని అంటూ చంద్రబాబు నాయుడిని అభినందించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు సభా నియమావళిని, సంప్రదాయాలని, చర్చలు, లేవనెత్తాల్సిన సమస్యలు, వాటిని ఏ రూపంలో సభలో చెప్పలనేదానిపై నేర్చుకోవాలని, దీనికోసం శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ ఐదేళ్లూ కష్టపడి పని చేయాలన్నారు. స్పీకర్ గా తన బాధ్యతలను సజావుగా నిర్వహిస్తానని భరోసా ఇచ్చారు.