Babu in Vizag: అపారమైన సహజ వనరులతో, దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్న మంచి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిందని టిడిపి అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వనరులను వినియోగించుకొని ఉంటే తాము ఇచ్చిన విజన్ ప్రకారం 2029 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు. తాము అభివృద్ధిపై ఏమి చేయాలో ఆలోచిస్తే జగన్ విధ్వంసం వైపు అడుగులేశారని చంద్రబాబు విమర్శించారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్న పారిశ్రామిక వేత్తలు వెళ్ళిపోయే పరిస్థితి నెలకొని ఉందన్నారు. జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, ఇప్పటికే అది 8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, మరో రెండేళ్లలో మరో3 లక్షల కోట్లు అయితే మొత్తంగా అది 11 లక్షల కోట్ల రోపాయలు అవుతుందని బాబు విమర్శించారు. వీటికి వడ్డీలు ఎవరు కడతారని ప్రశ్నించారు. పన్నులు విపరీతంగా పెంచుతున్నారని ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేశారని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలపై మోపుతున్న భారాన్ని అందరికీ వివరించాలని సూచించారు.
కాగా, టూరిజం రిసార్ట్స్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ రిషికొండను సందర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read : ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? బాబు