ఆర్ధిక సంస్కరణలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలతో పాటే సాంకేతికంగా పెనుమార్పులు సంభవించాయని, ఇంటర్నెట్ తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిందని అన్నారు. CBN CONNECT కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో చంద్రబాబు వర్చ్యువల్ మీటింగ్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఒకప్పుడు ఫోన్ మాట్లాడాలంటే రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, అమెరికాలో వార్తలు మనకు ఎప్పటికో గానీ తెలిసేవని, కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎక్కడి వార్తలైనా క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగిందని వివరించారు.
ఇప్పటివరకూ తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారని, కానీ జగన్ సిఎం అయిన తరువాత అభివృద్ధి ఆగిపోయి, విధ్వంసం ప్రారంభమైందని, భావితరాల భవిష్యత్ ప్రశ్నార్ధకాంలో పడిందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలే మాట్లాడలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇది తప్పు అని మాట్లాడితే వారిపై కూడా వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 25 ఏళ్ళక్రితం తాము చేపట్టిన అభివృద్ధి పనులవల్ల సమాజంలో గణనీయమైన మార్పులు సమాజంలో చోటు చేసుకున్నాయని, దానిలో తమ పాత్ర ఎంతగానో ఉందని, కానీ ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేయాల్సింద దుస్థితి నెలకొని ఉండడం బాధాకరమన్నారు.
ఈ పాలనకు నాలుగేళ్ళు పూర్తయిందని, ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉందని….విద్యార్ధులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేసి, భావితరాల భవిష్యత్ కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.